ఏమో గుర్రం ఎగురావచ్చు అని కలలు కన్న రోజులను మర్చిపోగలమా? పుష్పక విమానంలో ఇంద్రసభకు వెళ్ళగలమనే భ్రాంతితో గడిపిన రోజులను మర్చిపోగలమా? అద్భుత దీపం నుండి వచ్చిన భూతం సాయం పొందగలమని అపోహ పడిన రోజులను మర్చిపోగలమా? ఒంటి కన్ను రాక్షసుడితో యుద్ధం చేసి గెలవగలమనే ధీమాతో ఉన్న రోజులను మర్చిపోగలమా? మాయల మాంత్రికుడు ఎత్తుకెళ్లిన రాజకుమారిని కాపాడి ఆ రాజ్యానికే రాజవ్వచ్చని ఆశ పడిన రోజులను మర్చిపోగలమా?పున్నమి వెన్నెల్లో, గోదావరి ఇసుక తిన్నెల్లో స్నేహితులతో కలిసి గుజ్జిన గూళ్ళు కట్టుకున్న రోజులను మర్చిపోలేము. ఒళ్లు అలసి పోయే వరకు గోదావరిలో ఈతకొట్టిన రోజులను మర్చిపోలేము. సెలవుల్లో అమ్మమ్మ చెప్పిన రామాయణం, మహాభారతం, పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలను చెవులారా జుర్రుకున్న రోజులను మర్చిపోలేము. ఊరి గ్రంథాలయానికి వెళ్ళి చందమామ కథలు, బేతాళ కథలను చదివిన రోజులను మర్చిపోలేము. వేసవి కాలంలో ఆరుబయట మంచం మీద పడుకుని ఆ చందమామని చూస్తూ నాన్న చెప్పిన పంచతంత్ర కథలను ఆకళింపు చేసుకున్న రోజులను మర్చిపోలేము. బడిలో పంతులుగారు చెప్పిన నీతి శతకాలను వల్లెవేసిన రోజులను మర్చిపోలేము. ఈ తరం పిల్లలకి ఇలాంటి అనుభవాలు పూర్తిగా లేవనే చెప్పాలి. అందుకే చిన్న చిన్న కష్టాలకే కృంగిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకే అల్లాడిపోతున్నారు. చిన్న చిన్న అవరోధాలను కూడా దాటలేక ఆత్మహత్యల్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. తెలియని మానసిక రుగ్మతలకు గురి అవుతున్నారు. మేము చదివిన ఆ బాలశిక్షలను ఈ తరం వారికి కొద్దిగానైనా అందజేద్దామని చిరు ప్రయత్నం. నా ఈ బాలల కథల సంపుటి "బాల ధరణి" ని చదివి, మీకు తెలిసిన నలుగురిచేత చదివిస్తారని కోరుకుంటూ....
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.